Breaking News

పవన్ ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతాం?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి వ్యవహారం రెండు రోజులుగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాలన్నీ రెండు రోజుల పాటు ఈ టాపిక్ మీదే నడిచాయి. దాడిని ఖండిస్తూనే కోడి కత్తి లాంటి వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చి సీఎం పై రాయి దాడి విషయంలో సందేహాలు వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. మరోవైపు వైసీపీ ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఎంత చేయాలో అంతా చేస్తోంది.

పేదవాళ్ల కోసం పోరాడుతున్న జగన్ మీద పెత్తందారుల దాడి అంటూ హెడ్డింగ్స్ పెట్టి ఆయనకు ఎలివేషన్ ఇస్తున్నారు అనుకూల మీడియా, సోషల్ మీడియా జనాలు. ఐతే సీఎం జగన్‌పై రాయి దాడి విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడా అని అందరూ ఎదురు చూశారు. చంద్రబాబులా పవన్ ఒక సోషల్ మీడియా పోస్టు కూడా పెట్టలేదు.

కానీ ఈ విషయం మీద వారాహి యాత్రలో పవన్ చేసిన ప్రసంగం మాత్రం వైరల్ అయింది. జగన్‌పై రాయి దాడి మీద అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ జనాలకు ఆయన సంధించిన ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఏపీ జనంలో చైతన్యం చచ్చిపోయిందంటూ పవన్ చెప్పిన ఉదాహరణలు ఆలోచన రేకెత్తించేవే. అక్కను లైంగికంగా వేధించిన వారిని ప్రశ్నిస్తే అమర్‌నాథ్ అనే కుర్రాడిని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఎవరికీ బాధ లేదని.. ఒక మహిళను భర్త కళ్ల ముందే మానభంగం చేస్తే ఎవరూ స్పందించలేదని.. సుగాలి ప్రీతి అనే అమ్మాయిని హాస్టల్లో నాశనం చేసి చంపేస్తే ఎవరూ మాట్లాడలేదని.. కానీ జగన్‌కు గులకరాయి తగిలి చిన్న గాయం అయితే రాష్ట్రానికే గాయం అయినట్లు కలరింగ్ ఇస్తున్నారని.. రాష్ట్రం ఊగిపోతోందని.. ఇదేం న్యాయమని పవన్ ప్రశ్నించాడు.

తప్పు జగన్‌ది కాదు జనానిదే, మనలో చైతన్యం చచ్చిపోయిందంటూ పవన్ చేసిన ఆవేశపూరిత ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఉదంతాలే కాక కరోనా టైంలో మాస్కులు లేవని మీడియా ముందు మాట్లాడిన పాపానికి పిచ్చోడిగా ముద్ర వేసి సుధాకర్ అనే వైద్యుడిని చంపేసినా ప్రజలల్లో చలనం లేకపోయింది.

ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేశాక దర్జాగా బయట తిరిగేస్తున్నాడు. గత ఐదేళ్లలో ఇలాంటి ఘోరాలు ఎన్నో సైలెంట్‌గా సైడ్ అయిపోయిన నేపథ్యంలో పవన్ అడిగిన ప్రశ్నలకు జనం సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారా అన్నది ప్రశ్నార్థకమే.

Leave A Reply

Your email address will not be published.