Breaking News

జగన్ ని అంత మాట అనేశావేంటి షర్మిళ Sharmila

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుందని, కానీ మోడీకి జగన్ తొత్తుగా మారారని షాకింగ్ కామెంట్లు చేశారు.

నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలను జగన్ మోసం చేశారని షర్మిల విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, ప్రత్యేక హోదా తెస్తామని రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఆరోపించారు.

22 మంది ఎంపీలను పెట్టుకొని ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేదని జగన్ ను షర్మిల ప్రశ్నించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటిలో ప్రసంగించిన షర్మిల ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణస్వామిపై విమర్శలు గుప్పించారు. నాసిరకం లిక్కర్ వ్యాపారం లో ఆయన బాగా సంపాదించుకున్నారని, నాసిరకం మద్యంతో వైసిపి నేతలు ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

అయితే వైసిపి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చే డబ్బు తీసుకోవాలని, ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేయాలని షర్మిల కోరారు. వైసిపి ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతారని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని షర్మిల చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని వైయస్సార్ ఆకాంక్షించారని, ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే తాను ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.