Breaking News

విశాఖ : జీవీఎల్ మళ్లీ గెలుకుతున్నాడా ?


Published on: 4:00 pm, 16 April 2024

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా విశాఖపట్నం లోక్ సభ స్థానం తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. ఈ మేరకు అక్కడి నుండి టీడీపీ అభ్యర్థిగా శ్రీ భరత్ ను ప్రకటించడం, అతను ప్రచారం చేసుకోవడం జరుగుతున్నది. అయితే బీజేపీ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జీవీఎల్ నరసింహారావు అక్కడి నుండి పోటీ చేసే ప్రయత్నాలను ఇప్పటికీ వదులుకోలేదని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రాలో కీలక బీజేపీ నేతగా ఉన్న జీవీఎల్ కు జాతీయ స్థాయి బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉత్తరాది బీజేపీ నాయకుల వద్ద తన పోటీ అంశాన్ని ప్రస్తావించిన జీవీఎల్ తాజాగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఎన్నికలకు కేవలం 25 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో జీవీఎల్ విశాఖలో టీడీపీ అభ్యర్థికి అంటీముట్టనట్లుగా ఉండి ఢిల్లీలో చక్కర్లు కొట్టడం విశాఖ రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.

బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో 10 శాసనసభ, 6 లోక్ సభ స్థానాలలో పోటీ చేస్తుంది. అయితే పొత్తులో భాగంగా వచ్చిన స్థానాలలో కూడా టీడీపీ నేతలు వచ్చి బీజేపీ తరపున పోటీ చేస్తుండడం, బీజేపీకి ఇచ్చిన స్థానాలను పదే పదే మారుస్తుండడం, ఇందులో బీజేపీ సీనియర్లకు సమాచారం ఇవ్వకుండా బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జీవీఎల్ ఢిల్లీ స్థాయిలో విశాఖ పోటీకి ప్రయత్నాలు చేస్తుండడాన్ని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.