Breaking News

‘హీరో గారిని తన్ని తరిమేద్దాం’

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తనను మించిన శ్రేయోభిలాషి లేడన్నట్లు మాట్లాడేవారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. పొత్తులో భాగంగా జనసేనకు 60-70 సీట్లు ఇప్పించుకోవాలని, పవర్ షేరింగ్ ఉండాలని రకరకాల డిమాండ్లు చేస్తూ పవన్‌‌కు మద్దతుగా లేఖలు రాసిన వ్యక్తి ముద్రగడ. కానీ పవన్.. ఆయన్ని పట్టించుకోకపోవడంతో చక్కగా వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిపోయారు.

అక్కడ మాత్రం ఆయన ఎలాంటి షరతులూ పెట్టలేదు. బేషరతుగా ఏమీ ఆశించకుండా వైసీపీలో చేరుతున్నట్లు చెప్పారు. ఆ పార్టీలోకి వెళ్లాక పవన్ కళ్యాణ్‌ను పిఠాపురం నియోజకవర్గంలో ఓడించడమే లక్ష్యంగా ముద్రగడ పని చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేత అయిన ముద్రగడ ఒక నియోజకవర్గానికి పరిమితమై పవన్‌కు వ్యతిరేకంగా పని చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తాజాగా పవన్ గురించి ముద్రగడ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. వైసీపీ మార్కు భాషను వాడుతూ.. హీరో గారిని తన్ని తరిమేస్తే అంటూ పవన్‌ను ఉద్దేశించి ముద్రగడ వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రం మొత్తంలో వైసీపీకి పిఠాపురమే నంబర్ వన్ నియోజకవర్గం అని, సీఎం జగన్ ప్రాతినిధ్యం వహించే పులివెందుల కూడా రెండో స్థానంలో ఉంటుందని చెప్పడం ద్వారా పవన్‌ను ఓడించడాన్ని ఆ పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో చెప్పకనే చెప్పారు ముద్రగడ. ఈ క్రమంలోనే ఆయన.. ‘‘హీరో గారిని తన్ని తరిమేస్తే ఇకపై సినిమా హీరోలెవ్వరూ రాజకీయాల్లోకి రారు. వాళ్లు రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలందరి మీదా ఉందండీ’’ అనే కామెంట్ చేశారు.

సినిమా హీరోలు షూటింగుల కోసం ఎమ్మెల్యే పదవులు ఆశిస్తున్నారని.. వాళ్లు గెలిచినా అందుబాటులో ఉండరని.. ప్రజలు సమస్యలు చెప్పుకోలేరని ముద్రగడ అన్నారు. పిఠాపురం ప్రజలు డబ్బులకు అమ్ముడుబోతారని పవన్ అంటున్నారని.. అలాంటి వ్యక్తిని ప్రజలు ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. నెల ముందు వరకు పవన్‌కు ఏదో మేలు చేస్తున్నట్లు లేఖలు రాసిన ముద్రగడ.. ఇప్పుడు వైసీపీలో చేరగానే సినిమా నటులంతా వేస్ట్ అన్నట్లుగా మాట్లాడుతూ.. తన్ని తరిమేయాలనే కామెంట్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.