Breaking News

సికింద్రాబాద్‌లో సీనియ‌ర్ల పోరు.. గెలిచేదెవ‌రో?

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌లోనూ పొలిటిక‌ల్ వార్ మ‌రో స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో వీలైన‌న్నీ ఎక్కువ సీట్లు గెలుచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా మూడు పార్టీలు సాగుతున్నాయి. అందుకు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంపై స్పెష‌ల్ ఫోక‌స్‌తో క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సికింద్రాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంపై అంద‌రి దృష్టి ఉంది. ఇక్క‌డి నుంచి సిటింగ్ ఎంపీగా ఉన్న బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి మ‌రోసారి పోటీకి సై అంటున్నారు. ఆయ‌న బ‌రిలో దిగ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది.

ఇక కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నుంచి కూడా సీనియ‌ర్ నాయ‌కులే సికింద్రాబాద్‌లో స‌మ‌రానికి సై అంటున్నారు. తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి దానం నాగేంద‌ర్ పోటీలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ నుంచి ఖైర‌తాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ త‌ర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఎంపీగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ త‌ర‌పున సీనియ‌ర్ నాయ‌కుడు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే ప‌ద్మారావు గౌడ్ పోటీప‌డుతున్నారు. ఇలా మూడు పార్టీల నుంచి ముగ్గురు సీనియ‌ర్ నాయ‌కులు సికింద్రాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని చేజిక్కించుకునేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.

2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీకి 42.47 శాతం ఓట్లు వ‌చ్చాయి. బీఆర్ఎస్‌కు 35.61, కాంగ్రెస్‌కు 19.12 చొప్పున ఓట్లు ప‌డ్డాయి. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ లోక్‌స‌భ ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాల‌ను బీఆర్ఎస్ గెలుచుకుంది. దీంతో ఈ సారి సికింద్రాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో హోరాహోరీ పోరు త‌ప్ప‌ద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సిటింగ్ స్థానాన్ని కాపాడుకోవ‌డం కిష‌న్ రెడ్డికి స‌వాలే అని చెప్పాలి. ఇప్ప‌టికే కిష‌న్ రెడ్డి టార్గెట్‌గా రేవంత్ వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌క్కిన మ‌ద్ద‌తుతో లోక్‌స‌భ స్థానాన్ని కూడా కైవ‌సం చేసుకోవాల‌ని బీఆర్ఎస్ చూస్తోంది. మ‌రి ఈ ర‌స‌వత్త‌ర పోరులో విజ‌యం ఎవ‌రిదో వేచిచూడాలి.

Leave A Reply

Your email address will not be published.