Breaking News

  ఆ ఉద్య‌మ స్ఫూర్తి ఏది కేసీఆర్‌? KCR


Published on: 7:46 pm, 15 April 2024

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ది కీల‌క పాత్ర‌. ఒక్క‌డిగా మొద‌లెట్టిన ఆయ‌న‌.. మేధావులు, ఉద్య‌మ‌కారుల‌ను క‌లుపుకొని ముందుకు సాగారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి స్థాపించి ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ఉద్య‌మించారు. ద‌శాబ్ద‌ల పాటు తెలంగాణ ఉనికిని కాపాడుతూ ఉద్య‌మం చేశారు. ఏ ఆశ‌లు లేని స్థితి నుంచి గొప్ప‌గా పోరాడి స్వ‌రాష్ట్ర క‌ల‌ను సాకారం చేశార‌నే చెప్పాలి. ప్ర‌త్యేక తెలంగాణ సాధ‌న‌లో కేసీఆర్ చూపించిన ఉద్య‌మ స్ఫూర్తి వెల‌క‌ట్ట‌లేనిది. కానీ ఇప్పుడు ఆ స్ఫూర్తే కేసీఆర్‌లో కొర‌వ‌డింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీని చూడ‌టం త‌ప్ప కేసీఆర్ ఏం చేయ‌లేక‌పోతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఆంధ్ర పాల‌కుల‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ సాధ‌న కోసం ఉద్య‌మాన్ని న‌డిపిన ఘ‌న‌త కేసీఆర్ సొంతం. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చాక వ‌రుస‌గా రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. కానీ గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ చేతిలో ఘోర ప‌రాభ‌వంతో కేసీఆర్ ఢీలా ప‌డ్డార‌నే చెప్పాలి. ఆ ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయ ప‌రిణామాల‌ను చూస్తూ ఉండ‌టం త‌ప్ప కేసీఆర్ ఏం చేయ‌లేక‌పోతున్నార‌నే టాక్ ఉంది. తాజాగా లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు మందు కాంగ్రెస్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.  బీఆర్ఎస్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్ర‌తినిధులు, కీల‌క నాయ‌కుల‌ను త‌మ పార్టీలోకి చేర్చుకుంటోంది. ఓ ర‌కంగా బీఆర్ఎస్‌ను ఖాళీ చేసే ప్ర‌య‌త్నాలే జ‌రుగుతున్నాయ‌ని చెప్పాలి. అయినా కూడా కేసీఆర్ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

వ‌రంగల్ ఎంపీ అభ్య‌ర్థి కోసం వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి బీఆర్ఎస్‌కు ఎందుకొచ్చింద‌నే ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి.  అరూరి ర‌మేశ్‌ను పోటీ చేయ‌మంటే బీజేపీలోకి వెళ్లిపోయాడు. క‌డియం కావ్య‌కు సీటిచ్చిన త‌ర్వాత కూడా ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. ఇలా నాయ‌కుల‌కు పార్టీలో ఉండేలా న‌మ్మ‌కం క‌ల్పించ‌డంలో కేసీఆర్ విఫ‌ల‌మ‌వుతున్నార‌ని బీఆర్ఎస్ శ్రేణులే అనుకుంటున్నాయి. ఇక పార్టీ క్యాడ‌ర్‌లోనూ కేసీఆర్ పై విశ్వాసం త‌గ్గుతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. దిగువ స్థాయి నేత‌లు కూడా ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా చేవెళ్ల స‌భ‌లోనూ కేసీఆర్ స్పీచ్‌లో ఒక‌ప్ప‌టి మెరుపులు క‌నిపించ‌లేదు. ఎంత‌సేపు చెప్పిన మాట‌లే చెప్పి కాంగ్రెస్‌, బీజేపీకి ఎందుకు ఓటు వేయాల‌ని ప్ర‌శ్నించారు త‌ప్ప కొత్త‌గా ఏం లేదు. కేసీఆర్ వీలైనంత త్వ‌ర‌గా వాస్త‌వాన్ని గ్ర‌హించ‌క‌పోతే పార్టీ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం పొంచి ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

Leave A Reply

Your email address will not be published.