Breaking News

రాజకీయమే ఎంటర్టైన్మెంట్.. సినిమాలేల?

ప్రతి సంవత్సరం వేసవి వచ్చిందంటే బాక్సాఫీస్ కళకళలాడుతుంటుంది. పెద్ద సినిమాలు బరిలో ఉంటే ప్రేక్షకులు ఎగబడి చూస్తారు సమ్మర్ సీజన్లో. కానీ ఈసారి సమ్మర్ సీజన్ ఇండియన్ బాక్సాఫీస్‌కు ఏమంత ఆశాజనకంగా లేదు. తెలుగులో, హిందీలో ఓవైపు సరైన సినిమాలు పడట్లేదు. మరోవైపు ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్‌కే జనాలు ఓటేస్తున్నారు. ఇది చాలదన్నట్లు పొలిటికల్ హీట్ కూడా సినిమాలకు పెద్ద దెబ్బగా మారుతోంది.

ఓవైపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో పాటుగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు. ఇంకో నెల రోజుల్లోనే ఎన్నికలు జరగబోతుండడంతో జనం ఫోకస్ కూడా పూర్తిగా వాటి మీదే ఉంటోంది. ఏపీ రాజకీయం సినిమాలను మించిన ఎంటర్టైన్మెంట్ ఇస్తుండడంతో చెప్పుకోదగ్గ సినిమాలు లేని లోటు కూడా కనిపించడం లేదు.

రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరు అన్నట్లు.. ఇక్కడ ప్రతి వారం రోజులకు ఒక హాట్ టాపిక్ తెర మీదికి వస్తుంది. దాని మీదే రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి మీద మూడు రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది. జగన్ మీద ప్రత్యర్థులు హత్యా యత్నం చేశారని.. ఇది టీడీపీ గూండాలు చేసిన పనే అని.. దీని వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ ఆరోపిస్తూ దీని ద్వారా సింపతీ రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ గాయానికి సంబంధించి సోషల్ మీడియాలో, మీడియా వైసీపీ హడావుడి మామూలుగా లేదు.

చిన్న గాయానికి ఇంత డ్రామానా అంటూ వైసీపీ మీద ఎదురు దాడి చేస్తూ.. ఇది కూడా కోడి కత్తి తరహా డ్రాామా అంటూ టీడీపీ, జనసేన గట్టిగానే రిటార్ట్ ఇస్తున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ గాయం విషయంలో పొలిటికల్ మీటింగుల్లో స్పందించిన తీరు చర్చనీయాంశం అయ్యాయి. మరోవైపు టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ముఖానికి బ్యాండేజీలు వేసుకొచ్చి తనను చిన్న పిల్లాడు ఒకడు కొట్టాడని.. తనను గెలిపించాలని మీడియా ముందే చేసిన స్టంట్ భలే ఆసక్తిని రేకెత్తించింది.

ఇంకోవైపు షర్మిళ, సునీత వివేకా హత్య విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్తూ వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నాయి. సునీత ఈ కేసు విషయమై పెట్టిన ప్రెస్ మీట్ ప్రదర్శించిన వీడియోలు, ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మొత్తానికి ఏపీ రాజకీయం రేకెత్తిస్తున్న ఆసక్తితో పోలిస్తే సినిమా వినోదం జుజుబి అని.. ఇంకో నెల రోజులు ఈ ఎంటర్టైన్మెంట్‌ జనాలకు ఇచ్చే కిక్కే వేరని విశ్లేషకులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.